దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది.మరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే దానిపై ఓ సారి రివ్యూ చూద్దాం..
కథ ఏంటంటే.. అమెరికాలో ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం కేశవ(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు. పార్టీ ప్రసిడెంట్(వీటివీ గణేష్) స్పెషల్ పార్టీ అని సత్య ఆకెళ్ళను ఫామ్ హౌస్ కి తీసుకెళతాడు. అక్కడ పాండే గ్యాంగ్ సత్య ఆకెళ్ళని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేని విడుదల చేయమంటారు. సత్య కిడ్నాప్ బయటకు తెలిస్తే తమ రాష్ట్ర పరువు, సీఎం పదవి పోతుందని ఎవరికీ తెలియకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడాలని సీఎం నిర్ణయించుకుంటాడు.
మాజీ పోలీస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర రాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండి రాజు (వెంకటేష్)ని రంగంలోకి దించాలనుకుంటారు. అయితే రాజు సిన్సియర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో సస్పెండ్ అయి పెళ్లి చేసుకొని రాజమండ్రిలో భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేష్), పిల్లలతో లైఫ్ గడుపుతూ ఉంటాడు.దాంతో అతన్ని తీసుకురావడానికి అతని మాజీ ప్రేయసి, సత్యకి సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్ మీనాక్షి(మీనాక్షి చౌదరి)వెళ్తుంది.మరి ఆ తర్వాత ఏమైంది? పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్‌కు పంపించడానికి భాగ్యం (ఐశ్వర్య రాజేశ్) ఎలా ఒప్పుకొంది? సత్య ఆకెళ్ళని రాజు కాపాడాడా? వీళ్లు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగిలిన కథ. దీన్ని ధియేటర్లో చూడాల్సిందే.
ఇది పూర్తిగా అనిల్ మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చెప్పవచ్చు. అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అలా చూపించాడు. వెంకటేష్ కూడా తన నటనలో మరోసారి అదుర్స్ అనిపించాడని చెప్పవచ్చు. తన ప్రేమకథ గురించి భార్యకు తెలిశాక.. ఓవైపు ఆమెతో, మరోవైపు ప్రేయసితో వేగలేక ఫ్రస్టేషన్‌తో రగిలిపోయే వ్యక్తిగా వెంకీ పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి.
క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని హాలుకి రప్పించుకోదగ్గ సినిమా ఇది. సంక్రాంతిలో కామెడి కావాలనుకుంటే ఈ సినిమాతో ఎంజాయ్ చేయవచ్చు
గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!