ఈ సారి సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలిచాయి. అందులో ముందుగా మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer Movie) జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న నందమూరి కాంపౌడ్ నుంచి బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న దగ్గుబాటి కాంపౌండ్ నుంచి విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాబోతున్నాయి. ఇక రోజు థియేటర్లలోకి గేమ్ ఛేంజర్ వచ్చింది.
తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇది కాగా అందులో రామ్ చరణ్ కథానాయకుడుగా నటించాడు. ఇక ఐదేళ్ల తర్వాత రామ్‌చరణ్ కి వస్తున్న సోలో చిత్రం కూడా ఇదే..ఇన్ని ఆసక్తిక అంశాల మధ్య దిల్‌రాజు భారీ నిర్మాణవ్యయంతో ఈ సినిమాని రూపొందించడంతో దీనిపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని రేకెత్తించింది. మరి ప్రక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందా..సినీ లవర్స్ ని ఏ మేరకు మెప్పించింది ఓ సారి చూద్దాం.
గేమ్ ఛేంజర్ కథ ఏంటి ?
ఏపీ సీఎం అభ్యుదయ పార్టీకి చెందిన బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆర్డర్స్ జారీ చేస్తాడు. అయితే సీఎం నిర్ణయం అతని కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రి మాట పెడచెవిన పెట్టి అతనికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు.దీంతో పాటుగా తండ్రిని తప్పించి ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని కుట్రలు పన్నతుంటాడు. అదే సమయంలో యూపీలో యువ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్) విశాఖపట్నంకు కలెక్టర్‌గా వస్తాడు. ఈ జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.
రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు..సెకండాఫ్ బ్లాక్ బస్టర్, గేమ్ ఛేంజర్ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్
ఈ నేపథ్యంలోనే మంత్రి మోపిదేవి, కలెక్టర్ రామ్నందన్ మధ్య గొడవ మొదలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఓ యువ ఐఏఎస్ అధికారికీ, రాజకీయ నాయకుడికీ మధ్య సాగే ఓ యుద్ధం అని చెప్పవచ్చు. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్నందన్ని అధికార బలంతో ఎలా అడ్డుకోవాలని చూశాడు. రామ్నందన్.. మోపిదేవికి ఈ నేపథ్యంలో ఎలాంటి బదులిచ్చాడు? పార్వతి (అంజలి)తో రామ్నందన్కి ఉన్న సంబంధమేమిటి ? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాంగింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే తెరపైన చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది ?
శంకర్ గతంలో తీసిన ఒకే ఒక్కడు, శివాజీ తదితర సినిమాల్లోని మార్క్ ఇందులోనూ కనపడుతుంది. శాసన వ్యవస్థ, ఎన్నికల సంఘం మధ్య సాగే పోరాటంగా ఈ సినిమా ప్రేక్షకులకు కనిపిస్తుంది. సోషల్ మీడియా అమిత వేగంగా జనాల్లోకి చొచ్చుకుపోయిన నేటి రోజుల్లో సామాన్యులకు సీఎం ఎంపిక ఎలా అనేది, ఎన్నికలు ఎలా జరుగుతాయనేది తెలియకుండా ఉండి ఉండదు. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉన్నా దర్శకుడు కొన్ని సీన్లను చాలా ఆసక్తికరంగా మలిచాడు. ముఖ్యంగా ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలను ప్రేక్షకులను మెప్పిస్తాయి.
ఇక యుద్ద సన్నివేశాల్లో లీనమయిన ప్రేక్షకులకు అకస్మాత్తుగా రామ్నందన్ ఫ్లాష్‌బ్యాక్ కథల ప్రేమ కథ కొంచెం మైనస్ గా కనిపిస్తుంది. అయితే విరామ సన్నివేశాల్లో వచ్చే సస్పెన్స్ లు ఆకట్టుకుంటాయి. సాధారణంగా శంకర్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. ఇక రామ్‌చరణ్ (Ram Charan) మూడు కోణాల్లో పాత్రలో జీవించాడనే చెప్పాలి. కియారా అడ్వాణీ (kiara Advani) పాత్రకి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోయిన తనకున్న పరిధిలో ఆమె బాగా నటంచిందనే చెప్పాలి. అంజలి పార్వతిగా బాగా మెప్పించింది. భావోద్వేగాలను పండించింది.జయరాం, సముద్రఖని, రాజీవ్ కనకాల,సునీల్, వెన్నెల కిశోర్, నవీన్ చంద్ర, బ్రహ్మానందం, పృథ్వీ, రఘుబాబు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పుకోవచ్చు. ఇక తమన్ సంగీతం చిత్రానికి ప్రధానబలంగ చెప్పవచ్చు. జరగండి, రా మచ్చా, అరుగుమీద పాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ పని తీరు చాలా బాగుంది.
సినిమా గురించి రెండు మాటల్లో చెప్పాలంటే అభిమానులకు పుల్ గేమ్, ప్రేక్షకులకు గేమ్‌ని ఇంకాస్తా ఛేంజ్ చేసి ఆడించాల్సింది.
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! వివాదాలకు తావు లేదు.