VJY, Sep 13: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం లో శరవేగంగా దూసుకువెళ్తున్న రైతు సాధికార సంస్థ (Farmer Empowerment Organization) మరోసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. జైవిక్ ఇండియా అవార్డ్స్ వారు దేశవ్యాప్తంగా 2022 వ సంవత్సరానికి గాను నిర్వహించిన ఆర్గానిక్ ఫుడ్ ఇండియా పోటీల్లో 4 అవార్డ్స్ దక్కించుకొంది. రైతు సాధికార సంస్థతో పాటు మరో రెండు FPOs (Farmer Produced Organizations) మరో మహిళా రైతు ఈ అవార్డులు దక్కించుకొన్నారు.
FPO కేటగిరీలో అల్లూరి సీతారామరాజు జిల్లా జి . మాడుగుల గ్రామానికి చెందిన “నిట్టపుట్టు” ప్రకృతి వ్యవసాయ రైతు ఉత్పత్తిదారుల సంఘం మరియు పార్వతీపురంకు చెందిన “మాభూమి” ప్రకృతి వ్యవసాయ రైతు ఉత్పత్తిదారుల సంఘం అవార్డులు సొంతం చేసుకొన్నాయి. వ్యక్తిగత కేటగిరీ లో ఆర్గానిక్ సర్టిఫికేట్ కలిగి నాణ్యమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న YSR కడప జిల్లాకు చెందిన బండి ఓబులమ్మ ఎంపికయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు పంట ఉత్పత్తులను నాణ్యమైన పద్ధతిలో తయారు చేసి అత్యద్భుతంగా మార్కెటింగ్ చేస్తున్నందుకు గాను వీరికి ఈ అవార్డులు దక్కాయి.
ఈ నేల 23 వ తేదీన ఆగ్రాలోని తాజ్ హోటల్ లో జరిగే అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో వీరికి అవార్డులు ప్రధానం చేస్తారు. పాన్ ఇండియా స్థాయిలో జరిగే అవార్డ్స్ లో ఒకే సంస్థ నాలుగింటిని దక్కించుకోవడం విశేషం. రైతు సాధికార సంస్థకు మరియు ప్రత్యేకించి మార్కెటింగ్ విభాగానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.