YS Jagan Slams CM Chandrababu (Photo-FB and YSRCP)

Vjy, Jan 8: ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంపై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి మండిపడ్డారు.

ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా గత ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఈ పథకాన్ని దెబ్బ కొడుతున్నారని ధ్వజమెత్తారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆవేశంతోనే మాధవిలతపై ఆ పదం వాడానని వెల్లడి... వీడియో

అధికారంలోకి రాగానే ఒక ప్లాన్‌ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా, ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టు పెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?

YS Jagan Slams Chandrababu Govt

బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన 17 వైద్య కళాశాలలపై స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా?

చంద్రబాబూ.. ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీ­దారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా.. అలాంటి కంపెనీలకే ఆరోగ్యశ్రీని అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే కంపెనీల ధ్యేయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంత వరకు మనుగడలో ఉంటాయి? కోవిడ్‌ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు, ప్రమాదాల సమయంలో గత ప్రభుత్వం విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది.

ఈ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి అనేక మార్లు ఎంతో మందిని ఆదుకున్నాం. ఈ పని ప్రైవేటు కంపెనీలు చేయగలవా? మీ ప్రభుత్వం చేయించగలదా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు (చంద్ర­బాబు) ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోవడం వాస్తవం. ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?

నాలుగు సార్లు సీఎం అయ్యానని చంద్రబాబు గొప్పలు చెబుతుంటారు. అయితే పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఏనాడైనా అనుకున్నారా? కనీసం ఏరోజైనా ఆ ప్రయత్నం చేశారా? దివంగత మహానేత వైఎస్సార్‌ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్కపనైనా చేశారా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్సలు అందించే ప్రొసీజర్లను 1,000 నుంచి 3,257కి పెంచింది.

మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చి మధ్యతరగతి వారికీ మేలు చేశాం. రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేస్తూ, ఐదేళ్లలో 45.1 లక్షల మందికి రూ.13,421 కోట్లతో ఉచితంగా వైద్యాన్ని అందించాం.

చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, విశ్రాంతి సమయంలో రోగులకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. దీని కింద 24.59 లక్షల మందికి మరో రూ.1,465 కోట్లు అందించాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్త అంబులెన్స్‌లతో 104, 108 సేవలను మెరుగుపరిస్తే, చంద్రబాబు నెలల తరబడి బకాయిలుపెట్టి అంబులెన్స్‌ సేవలను సైతం నిర్వీర్యం చేశారు.

బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ.. అని చంద్రబాబు ఎన్నికల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను దుర్మార్గంగా ఎగరగొడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనూ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా.. ఉన్న గ్యారంటీనీ తీసేశారు. ప్రజలకు నష్టంచేసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలని ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నా అని తెలిపారు.