GOLDEN GLOBE AWARD FOR Naatu Naatu (PIC @ RRR Twitter)

California, JAN 11: టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది. సినిమాలోని ‘నాటునాటు’ (Naatu Naatu song) పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ మాస్‌ సాంగ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించాయి. గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు-2023 వేడుక అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌(Best original song), బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ మూవీ విభాగాల్లో నామినేట్‌ అయింది. ఇందులో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డును దక్కించుకున్నది.

కాగా, మొదటిసారిగా ఒక భారతీయ సినిమాకు అందులోనూ ఓ తెలుగు సినిమాకు ఈ అవార్డు దక్కడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆస్కార్‌ బరిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నది.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి (MM Keeravani) అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు తన సోదరుడికి దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్‌ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాళభైవర అద్భుత సహకారం అందిచారన్నారు. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.