Chalapathi Rao Credits: Twitter

Hyderabad, DEC 25: సీనియర్ నటుడు చలపతి రావు (Chalapathi Rao) మరణంతో టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకొంది. తెలుగుతెరపై విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించిన చలపతి రావు (Chalapathi Rao) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే 78 ఏళ్ళ వయసు చలపతి ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. అయన మరణవార్త విన్న సినీ ప్రముకులు వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా చలపతి రావుకి నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో అయన మరణవార్త విన్న బాలకృష్ణ(balakrishna), ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్ రామ్ (Kalyanram) భావోద్వేగానికి గురయ్యారు. చలపతి రావు గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. “చలపతి రావు గారు తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నాన్నగారితో ఎన్నో సినిమాల్లో నటించిన అయన, నాతో కూడా ఎన్నో సినిమాలు చేశారు. చలపతి రావు కూడా మా కుటుంబంలో సభ్యుల్లో ఒకరు. అయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్.. “చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

కళ్యాణ్ రామ్.. “చలపతిరావు బాబాయి అంటే వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. అయన ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నష్టాన్ని పదాలు వివరించలేవు. అయన కుటుంబానికి ఈ బాధను అధిగమించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతోనే చలపతిరావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని చలపతిరావు గతంలో ఎన్నో ఇంటర్వూలలో తెలిపాడు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి చలపతిరావు నందమూరి కుటుంబానికి ఆప్తుడిగా ఉండేవాడు. బాలకృష్ణతో, తారక్‌తో చాలా సినిమాల్లో నటించాడు. అంతేకాకుండా జూ.ఎన్టీఆర్‌.. చలపతిరావును బాబాయి అని ఆప్యాయంగా పిలుస్తాడు. కాగా చలపతిరావు మరణ వార్త తెలియగానే.. అమెరికాలో ఉన్న తారక్‌.. రవిబాబుకు వీడియో కాల్‌ చేసి, ఆయన్ని చివరి చూపు చూశాడు. అనంతరం రవిబాబుకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చలపతిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు రవిబాబు చెప్పాడు. తన సోదరి అమెరికా నుండి రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అభిమానుల సందర్శనార్థం చలపతిరావు పార్థీవ దేహాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు.