New Parliament Building

New Delhi, December 02: ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు (Winter Sessions) జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు (Government Agenda) తెలుస్తున్నది. బిల్లుల్లో జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2023, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు ఉన్నట్లు తెలుస్తున్నది. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో సెషన్స్‌లోనే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ లాస్‌ (ప్రత్యేక నిబంధనలు) రెండో (సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనున్నది. చట్టం చెల్లుబాటును 2026 డిసెంబర్‌ 31 వరకు పొడిగించాలని కోరింది.

 

తాతాల్కిలిక పన్నుల సేకరణ బిల్లు-2023, కేంద్ర వస్తువులు-సేవల పన్నులు (రెండో సవరణ) బిల్లు, సెంట్రల్‌ యూనివర్సిటీ (సవరణ) బిల్లు, తెలంగాణలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, బాయిలర్స్‌ బిల్లు సైతం పార్లమెంట్‌ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటు ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను (CrPC and Evidence Act) ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

 

ప్రస్తుతం పెండింగ్‌లో 37 బిల్లు ఉండగా.. 12 వరకు చర్చించనున్నట్లు సమాచారం. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ‘కఠోరమైంది’గా పేర్కొంది. ఆగస్టులో వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ల నియామకం.. వేతనం, తొలగింపుపై కేంద్రానికి నియంత్రణను ఇచ్చే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లుపై సైతం పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.