Bengaluru Rains (PIC@ ANI Twitter)

Bangalore, May 21: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. ఎండలతో వేడెక్కిన నగరంలో వర్షం కాస్త ఉపశమనాన్ని ఇచ్చినా పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజులు వర్షాలు పడుతాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.  మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు.

అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో బెంగళూరు సహా సలు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి భారీగా వరద నీరు చేరింది.

భారీ వర్షం కారణంగా నగరంలోని కేఆర్‌ సర్కిల్‌లోని అండర్‌పాస్‌ వద్ద వర్షం నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. కారులో ఉన్న వారిని రక్షించారు. కారు నీటిలో మునగడంతో అస్వస్థతకు గురైన భాను రేఖ (23) మృతి చెందింది. వరద నీటిలో చిక్కుకున్న సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మృతురాలిని ఏపీ విజయవాడకు చెందిన మహిళగా గుర్తించారు. భాను రేఖ బెంగళూరులో ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నది.