Calcutta High Court (Photo Credit- Wikimedia Commons)

Kolkata, March 03: పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపేనని (sexual harassment) కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పష్టం చేసింది. అలా పిలిచిన వ్యక్తులను 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని తెలిపింది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌గుప్తా తీర్పు వెలువరించారు. గతేడాది అండమాన్‌ నికోబార్‌లోని మాయాబందర్‌ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. వారిలో ఒక మహిళా కానిస్టేబుల్‌ దగ్గర్లోని వీధిలైటు వద్దకు వెళుతుండగా.. మద్యం మత్తులో జనక్‌ రామ్‌ అనే వ్యక్తి ఆమెను డార్లింగ్‌ (darling) అని పిలవడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

 

దీనిపై విచారణ చేపట్టిన నార్త్‌ - మిడిల్‌ అండమాన్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో అతడు సవాల్‌ చేయగా.. దాన్ని తిరస్కరించారు. అనంతరం కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ జై సేన్‌గుప్తా ధర్మాసనం ఫస్ట్‌క్లాస్‌ కోర్టు  తీర్పును సమర్థించడంతోపాటు.. డార్లింగ్‌ అని పిలవడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది.