Gurgaon, OCT 28: దీపావళి (Diwali) వచ్చిందంటే చాలు, రకరకాలుగా టపాకాయలు పేల్చడం మనం చూస్తూనే ఉంటాం. కొందరు ఆకతాయిలు రోడ్లపై టపాసులు పేల్చుతుంటే, మరికొందరు ఇతరులను ఇబ్బందిపెట్టేలా కాల్చుతుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియా (Social Media) వచ్చిన తర్వాత రీల్స్ (Reels) కోసం టపాసులు కాల్చే ట్రెండ్ మొదలైంది. అలా ఇన్‌ స్టాగ్రాం రీల్స్ (Instagram Reels) కోసం టపాసులు కాల్చి కటకటాల పాలయ్యారు ముగ్గురు వ్యాపారస్తులు. ఈ ఘటన గురుగ్రాంలో జరిగింది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే...రోడ్డు మీద వెళ్లే ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా టపాసులు కాల్చారు. గురుగ్రాంలోని శంకర్ చౌక్‌ వద్ద ఓ కారు వెనుక భాగంలో టపాకాయలు అంటించి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. దీంతో అటుగా వెళ్తున్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

అంతేకాదు తాము చేసిన ఘన కార్యాన్ని ఇన్ స్టాగ్రాం రీల్స్ రూపంలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌ గా మారడంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు ఈ ఆకతాయి పనికి పాల్పడ్డారని గుర్తించారు. అంతేకాదు వీళ్లంతా గురుగ్రాంలో బిజినెస్ చేస్తున్నారని, కేవలం ఇన్ స్టా రీల్స్ కోసమే ఈ పని చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి రెండు కార్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.