Heavy Rains in North India (PIC@ ANI Twitter)

New Delhi, July 09: ఢిల్లీలో రికార్డుస్థాయిలో (Delhi Rains) వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల పాత భవనాలు కూలుతున్నాయి. హస్తినలో ఒక్కరోజులోనే 12.6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. 40 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షపాతం (Delhi Rains) నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఇండియా గేట్, మండిహౌజ్, కన్నౌట్ ప్యాలెస్, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.  ఎడతెరిపి లేని వర్షాలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్ష (Aravind Kejriwal) నిర్వహించారు. సెలవులను రద్దు చేసుకొని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, మేయర్ సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి.. సహాయకచర్యలను పరిశీలించాలన్నరు.

ఢిల్లీలో ఒక్కరోజులోనే 12.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఒక సీజన్ లో కురిసే వానలో 15 శాతం కేవలం 12 గంటల్లోనే పడడంతో.. వరదలు పోటెత్తాయని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కుండపోత వర్షాలతో ఢిల్లీలో పలు పాత భవనాలు, గోడలు కూలిపోతున్నాయి. దాంతో స్కూల్ బిల్డింగుల పరిస్థితిని పరిశీలించాల్సిందిగా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ మంత్రి అతీషి ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్ల స్వయంగా పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో అన్ని స్కూళ్లకు సోమవారం రోజున సెలవు ప్రకటించారు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ను (Himachal pradesh) కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదతో నదిలోకి భారీగా వరదనీరు చేరింది. సిమ్లా, మనాలి, కులు సహా పలు ప్రాంతాల్లో నది పోటెత్తి ప్రవహిస్తోంది. మనాలిలో బియాస్ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. నది ఒడ్డున పార్కింగ్ చేసి కార్లు వరదలో కొట్టుకుపోయాయి.

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం కారణంగా పలు చోట్ల రైల్వే ట్రాక్ పైకి నీరు చేరింది. అక్కడక్కడ చెట్లు విరిగిపడ్డాయి. దాంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కులు దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. రానున్న 24 గంటల్లో 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ముందుజాగ్రత్తగా మనాలి-లేహ్ రహదారిని మూసివేశారు.

 

హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు (Himachal Rains), వరద పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేశారు సీఎం సుఖ్విందర్ సింగ్. రానున్న 24 గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు నదులు, నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

హిమాచల్ లో కుంభవృష్టి కారణంగా చాబా పవర్‌ హౌస్‌ వరద నీటిలో మునిగిపోయింది. పంపులన్నీ నీట మునిగాయి. మరోవైపు మండి జిల్లాలో బియాస్‌ నదిపై జనం రాకపోకల కోసం ఏర్పాటు చేసిన వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఆట్ – బంజర్‌ ప్రాంతాలను కలుపుతూ బియాస్‌ నదిపై ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.

ఇదిలావుంటే బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండి జిల్లాలోని ఓ గ్రామాన్ని వరదనీరు ముంచెత్తింది. నది పరిసరాల్లోని పండోహ్‌ గ్రామం నుంచి బియాస్‌ (Beas River) వరద ప్రవహిస్తున్నది. బియాస్‌ నది ఉధృత ప్రవాహానికి మండి జిల్లాలోని పంచవక్త్ర ఆలయం కూడా నీట మునిగింది. ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కేవలం ఆలయంలోని ప్రధాన గోపురాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో 12 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటూ జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. పంజాబ్‌, హర్యానా, యూపీ, ఈస్ట్ రాజస్థాన్‌ ల్లోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐంఎడీ అధికారులు తెలిపారు.

 

ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూకశ్మీర్ లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు ఢిల్లీలోనూ మరో 24 గంటల పాటూ కుండపోత వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది ఐంఎడీ. అటు భారీ వర్షాల కారణంగా మూడురోజుల పాటూ తాత్కాలికంగా నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షాలు, మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడటంతో మూడు రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ప్రస్తుతం దారులను క్లియర్ చేయడంతో పాటూ, వాతావరణం అనుకూలించడంతో యాత్రను పునః ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.