Heavy rains (PIC ANI Twitter)

New Delhi, June 25: దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. ఢిల్లీతోపాటు నోయిడా, గురుగ్రామ్‌ (Gurugram), ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయింది.

దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.   ఢిల్లీ, హర్యానా (Haryana), రాజస్థాన్‌లోని (Rajasthan) ఫరూఖ్‌ నగర్‌, కోసాలి, మహేందర్‌గఢ్‌, సొహానా, రెవారి, నార్నౌల్‌, బావల్‌, భివారి, తిజారా, ఖైర్తాల్‌, కోట్‌పుట్లీ, ఆల్వార్‌, విరాట్‌నగర్‌, లక్ష్మాగఢ్‌, రాజ్‌గఢ్‌, నబ్దాయ్‌, భరత్‌పూర్‌, మహావా, బయానా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh Rains)లో భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. కులు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఇంటి ముందు పార్కింగ్ చేసిన 8 వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

మరోవైపు ముంబైలో (Mumbai Rains) భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న రెండు రోజుల పాటూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాంల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల పాటూ మధ్యప్రదేశ్, హిమాచల్ లో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐంఎడీ హెచ్చరించింది.