SS Rajamouli (Photo Credits: Twitter)

Mumbai, FEB 18: టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి (SS Rajamouli) తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమానే ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. బాహుబలి సినిమాతో మన నైపుణ్యత ఏంటో అంతర్జాతీయ సినీ రంగానికి తెలియజేసిన రాజమౌళి.. RRR సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ మూవీస్ తో పోటీ పడేలా చేశాడు. ఈ నేపథ్యంలోనే పలు అంతర్జాతీయ వేడుకల్లో ఎన్నో అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా.. ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఈ అవార్డుల పంటతో రాజమౌళి (SS Rajamouli) అండ్ టీం పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రామాయణం, మహాభారతం మీ చిత్రాలను ఎలా ప్రభావితం చేశాయి అంటూ విలేకరి ప్రశ్నించగా, రాజమౌళి బదులిస్తూ.. నా చిన్నతనంలో ఆ గ్రంధాల్లోని కథలు వింటూ, చదువుతూ పెరిగాను. అవి నన్ను ఎంతగానో ఆకర్షించాయి. కానీ నాకు ఆలోచించే వయసు వచ్చాక.. కథలు కాకుండా పాత్రలు, పాత్రలలోని సంఘర్షణలు మరియు వాటి మధ్య భావోద్వేగాలను చూడగలిగాను. ఆ భావోద్వేగాలే నా చిత్రాల్లో కనిపిస్తాయి అని చెప్పుకొచ్చాడు.

Taraka Ratna Latest Health Update: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, ఆస్పత్రిలోనే బాలకృష్ణ, ఆందోళనలో అభిమానులు ఎయిర్ అంబులెన్స్‌ లో హైదరాబాద్ కు తరలించే అవకాశం 

కానీ మీరు నాస్తికుడిని అంటూ చెప్పుకుంటారు కదా అని ఇంటర్వ్యూయర్ అడగగా, రాజమౌళి బదులిస్తూ.. నా కుటుంబం వలన నేను మొదటిలో హిందూ మతాన్ని బాగా ఫాలో అయ్యేవాడిని. కొన్నాళ్ళు సన్యాసిగా కూడా జీవించా. ఆ సమయంలోనే కొంతమంది స్నేహితులతో క్రైస్తవ మతంలోకి కూడా అడుగుపెట్టాను. ఆ తరువాత చాలా కాలం పాటు చర్చికి వెళ్ళాను, బైబిల్ చదివి ఒక క్రిస్టియన్ గా బ్రతికాను. ఇదంతా చేశాక నాకు ఒక విషయం అర్ధమైంది. మతం అనేది ఒక రకమైన దోపిడీ అని అనిపించింది. అందుకే నాస్తికుడిగా మారాను. కానీ ఆ గ్రంధాల్లోని గొప్ప కథలు, పాత్రలు నా మనసులో గట్టిగా పాతుకుపోయాయి అంటూ వివరించాడు. అయితే రాజమౌళి ‘మతం అనేది ఒక రకమైన దోపిడీ’ అని చేసిన వ్యాఖ్యలను కొంతమంది మతవాదులు ఖండిస్తున్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా రాజమౌళిని దాడి చేస్తున్నారు.

మతంపై రాజమౌళి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేయటం మొదలు పెట్టారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఎన్నో విషయాలను పక్కన పెట్టి, దీన్ని పట్టుకుని హైలైట్‌ చేయటం మొదలు పెట్టడంతో రాజమౌళికి సపోర్ట్‌ చేస్తూ కంగనా (Kangana Ranaut) వరుస ట్వీట్లు చేశారు. ‘‘మరీ అంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. మాటల కన్నా చేతలే కనిపించాలి. మేము అందరి కోసం సినిమాలు చేస్తాం. నటులు కావడం వల్లే ప్రతి ఒక్కరూ మాపై దాడి చేసేందుకు చూస్తారు. మాకు ఎవరి సాయం ఉండదు. మాకు మేమే సాయం చేసుకోవాలి. అండగా నిలవాలి. రాజమౌళి సర్‌ని ఎవరైనా ఏమైనా ఉంటే ఊరుకోను. ఆయన వర్షంలో మండే నిప్పు. ఒక జీనియస్‌. జాతీయవాది. యోగి. రాజమౌళిలాంటి వ్యక్తి మనకు ఉండటం మనం చేసుకున్న అదృష్టం’’

‘‘ఈ ప్రపంచం రాజమౌళిని వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేస్తోంది ఎందుకు?ఆయన సృష్టించిన వివాదం ఏంటి? ‘బాహుబలి’తో మన ఖ్యాతిని పెంచడమా? దేశం గర్వించే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తీయడమా?అంతర్జాతీయ వేదికలపై ధోతి ధరించడమా? చెప్పండి . ఆయన ఎందుకు వివాదాస్పద వ్యక్తి అయ్యారు? దేశాన్ని ప్రేమించి, ప్రాంతీయ సినిమాను ప్రపంచవ్యాప్తం చేయడమేనా ఆయన చేసిన వివాదం. దేశం పట్ల ఆయన ఎంతో అంకితభావంతో ఉన్నారు. ఇందుకేనా ఆయన్ను వివాదాస్పదుడిని చేస్తున్నారు. రాజమౌళి చిత్తశుద్ధిని, వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం. అందరూ సిగ్గు పడాలి’’ అంటూ కంగనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వరుస ట్వీట్‌లు చేశారు.