Vande Bharat Express (Photo-PTI)

Kapurthala, May 31: 2022-23 సంవత్సరానికి సంబంధించి 32 వందేభారత్ రైళ్లను (Vande Bharat Trains) ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Kapurthala Rail Coach Factory) దారుణంగా విఫలమైంది.  నిర్దేశిత సమయం పూర్తైనప్పటికీ ఒక్కటంటే ఒక్క వందేభారత్ రైలును కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. అయితే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తమకు అందడంలో ఆలస్యం జరిగిందని అందుకే ఒక్క రైలును కూడా ఉత్పత్తి చేయలేకపోయినట్లు కోచ్ ఫ్యాక్టరీ సంజాయిషీ ఇచ్చుకుంది. తాజాగా విడుదలైన డాక్యూమెంట్లలో ఈ విషయం వెల్లడైంది. వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.  కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ (Kapurthala Rail Coach Factory) ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు.

ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర్తలా ఫ్యాక్టరీ ఇదే తీరున ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి భారీగానే పడిపోయినట్లు చెబుతున్నారు. 1,885 కోచులు తయారు చేయాలని లక్ష్యం ఉండగా కేవలం 1,478 కోచులను మాత్రమే ఉత్పత్తి చేశారు.

Free Bus Travel For Women in Karnataka: మహిళలందరికి ప్రభుత్వ బస్సుల్లో ఇకపై ఉచిత ప్రయాణం, అధికారికంగా వెల్లడించిన కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి 

ఇక 256 త్రీహెచ్‭పీలను తయారు చేయాలని లక్ష్యం ఉండగా కేవలం 153 త్రీహెచ్‭పీలను మాత్రమే ఉత్పత్తి చేశారు.  అలాగే 1,520 ఎల్‭హెచ్‭బీలకు గాను 1,325 ఎల్‭హెచ్‭బీలను మాత్రమే ఉత్పత్తి చేశారు. అయితే వందేభారత్ రైళ్ల తయారీ గురించి ఒక అధికారి మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో ఆ తయారీ 2024 సెప్టెంబరులో ప్రారంభమవుతుందని అన్నారు. నిజానికి ఈ యేడాది 64 వందేభారత్ రైళ్లను కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని మొదట ప్లాన్ చేశారు. కానీ ఆ పనే ఇప్పటికి పట్టాలు ఎక్కలేదు.