Kargil Vijay Diwas: లద్దాఖ్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్, నివాళులు అర్పించిన రక్షణమంత్రి, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, సరిహద్దుల్లో ఆకట్టుకున్న విన్యాసాలు
Kargil Vijay Diwas (PIC@ Twitter ANI)

Ladakh, July 26: కార్గిల్ విజయ్ దివస్ (Vijay Diwas) సందర్భంగా లద్దాఖ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ (Rajnath Singh). అమరవీరుల స్థూపం (Kargil war Bravehearts) వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించిన రాజ్‌నాథ్‌...అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1999 కార్గిల్ అమరులను గుర్తు చేసుకున్నారు. వారి స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం కార్గిల్ అమరుల కుటుంబాలను కలిశారు రాజ్‌నాథ్. అటు లద్దాఖ్‌ లో సైనికులను ఉద్దేశించి రాజ్‌ నాథ్‌ ప్రసంగించారు.

అటు ప్రధాని మోదీ కూడా కార్గిల్ అమరవీరులను గుర్తు చేసుకున్నారు. వారికి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏయిర్ స్టాఫ్ చీఫ్ వీర్ చౌదరిలు కూడా కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు.

మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా కార్గిల్ అమరులను గుర్తుచేసుకున్నారు. అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. లక్నోలోని కార్గిల్ అమరుల స్థూపాన్ని ఆయన సందర్శించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రెండు రోజుల పాటూ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే లద్దాక్‌ లో యుద్ధవిమానాలతో విన్యాసాలు చేస్తున్నారు. నాలుగు మిగ్ 29 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, మూడు చీతల్ హెలికాప్టర్లతో కార్గిల్ అమరుల స్థూపంపై పూలజల్లు కురిపించారు.

1999లో జరిగిన కార్గిల్ వార్‌లో 559 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారి స్మృతిలో ప్రతి ఏడాది కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహిస్తోంది కేంద్రం.