New Delhi, March 25: దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన స్టూడెంట్స్ యూనియన్ (JNUSU) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో వామపక్ష అభ్యర్థులు గెలుపొందారు. బీఏపీఎస్‌ఏ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 73 శాతం ఓట్లు పోలయ్యాయి. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి ధనంజయ్ (Dhananjay) విజయం సాధించారు. జెఎన్‌యూఎస్‌యూ సెంట్రల్ ప్యానెల్‌లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ధనంజయ్ విజయం సాధించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరాపై ధనంజయ్ 922 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
VIDEO | JNUSU Polls 2024: JNU students celebrate in the campus after the announcement of election results for the Student’s Union earlier today.#JNUElection2024 pic.twitter.com/N9M0BYFRjM
— Press Trust of India (@PTI_News) March 24, 2024
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ధనంజయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ లో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆయన బీహార్‌లోని గయ జిల్లాకు చెందిన విద్యార్థి. ధనంజయ్ 1996 తర్వాత జెఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కి ఎన్నికైన మొదటి దళిత అధ్యక్షుడు. 1996లో బత్తిలాల్ బైరవ విజయం సాధించారు. ధనంజయ్ మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రత, స్కాలర్‌షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు మొదలైనవి తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.