2024 భారతదేశం ఎన్నికలు: పోలింగ్ కు దూరంగా 40 శాతం మంది ఓట‌ర్లు, తొలిద‌శ‌లో సా.5 గంటల వ‌ర‌కు కేవ‌లం 60 శాతం పోలింగ్ న‌మోదు, అత్య‌ధికంగా ప‌శ్చిమ బెంగాల్ లో పోలింగ్, రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాలు ఇవిగో!
Polling (Credits: X)

New Delhi, April 19: లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్‌ (Polling) చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 77.57 శాతం, అత్యల్పంగా బీహార్లో 46.32 శాతం పోలింగ్‌ జరిగింది. అయితే పోలింగ్‌ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్‌లలో ఉన్నవారు ప్రస్తుతం ఓట్లు వేస్తున్నారు. దాంతో మరో రెండు లేదా మూడు శాతం పోలింగ్‌ పెరిగే అవకాశం ఉంది. అయినా ఇది చాలా తక్కువ శాతం పోలింగ్‌గానే చెప్పవచ్చు. ఇదిలావుంటే సాయంత్రం 5 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం.. తమిళనాడులో 62.08 శాతం, రాజస్థాన్‌లో మరీ 50.27 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.54 శాతం, మధ్యప్రదేశ్‌లో 63.25 శాతం, మహారాష్ట్రలో 54.85 శాతం పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 67.5 శాతం, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓట్లు పోలయ్యాయి.

 

మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ నిర్వహించారు. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా ఇవాళే జరిగింది. ఏడు విడతల పోలింగ్‌ ముగిసిన తర్వాత జూన్‌ 4న ఫలితాలను ప్రకటించనున్నారు.