Raipur, April 17: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ (Chhattisgarh Encounter) జరిగింది. నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అనధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఖ్య మరింత పెరుగొచ్చని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని పోలీసులు చెబుతున్నారు.

 

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాకు చెందిన శంకర్‌రావు (Maoist Leader Shankar Rao) కూడా ఉన్నారని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉన్నది. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్‌ రైఫిళ్లు, కార్బైన్‌, 303 రైపిల్స్‌, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, చికిత్స కోసం దవాఖానకు తరలించినట్టు బస్తర్‌ రేంజ్‌ ఐజీపీ పీ సుందర్‌రాజ్‌ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్రైక్‌గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు.

 

గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో (Chhattisgarh Encounter) ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి.