Rep Image (File Image)

New Delhi, March 13:  ఆధార్ అడ్రస్‌ తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లో అప్ డేట్ (Aadhar Update) చేసుకునే వారికి ఆ సేవలను ఉచితంగా అందజేసే గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తెలిపింది. ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా.. ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్ లో పోస్టు చేసింది. దీంతో జూన్ 14 వరకు ఆధార్ కార్డులో ఉచితంగా మార్పులు చేసుకొనే అవకాశం లభిస్తుంది. మై ఆధార్ (My Aadhaar) పోర్టల్ మాత్రమే ఆ సేవలను ఉచితంగా అందిస్తుంది.

 

2023 ఫిబ్రవరి వరకే తొలుత ఈ ఉచిత సేవల గడువు ఉండగా.. అదే ఏడాది డిసెంబర్ 14 వరకు పొడిగించారు. ఆ తరువాత 2024 మార్చి 14 దాకా అవకాశం కల్పించారు. తాజాగా మరోసారి గడువును మూడు నెలలు పెంచుతూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ తీసుకొని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యాక లేటెస్ట్ గుర్తింపు కార్డు, చిరునామా వివరాలను సమర్పించాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వాడుకోవచ్చు. టీసీ, మార్క్ షీట్, పాన్ లేదా ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్సు వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది.