Vishnu Deo Sai (Credits: X)

Raipur, DEC 10: ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్‌కు కొత్త ముఖ్యమంత్రి (Chhattisgarh New Cm Vishnu Deo Sai) నియామకం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఎనిమిది రోజులకు ఈరోజు రాయ్‌పూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో గిరిజన నేత విష్ణుదేవ్ సాయిని (Chhattisgarh New Cm Vishnu Deo Sai) ఆమోదించారు. ఈ సమావేశంలో బీజేపీ పరిశీలకులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అందరి అంగీకారంతోనే ఆయన పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించారు. సీనియర్ నేతల్ని పక్కన పెట్టిన బీజేపీ (BJP).. వివాదాలు, వర్గపోరు అన్నీ విస్మరించి కొత్త ముఖానికి ఛత్తీస్‌గఢ్‌ అధికారాన్ని అప్పగించింది. అజిత్ జోగి తర్వాత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అయిన రెండవ గిరిజన వ్యక్తిగా విష్ణుదేవ్ ఖ్యాతిగాంచారు.

 

విష్ణు దేవ్ సాయి చత్తీస్‌గఢ్ రాజకీయాలకు పెద్ద ముఖం. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు (Raman Singh) సన్నిహితుడు. రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన గిరిజన సమాజానికి చెందిన నాయకుడు. 4 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు బీజేపీలో పని చేసిన మంచి అనుభవం ఉంది. ఆయన కుంకూరి ప్రాంతంలోని బాగియా గ్రామ నివాసి.

 

విష్ణుదేవ్ తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో ప్రారంభించారు. 1990లో తన స్వగ్రామం బాగియా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాదిలో తప్కారా నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1998 వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగారు. 1999లో రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు. 2006లో బీజేపీ ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. 2009లో మళ్లీ రాయ్‌గఢ్ లోక్‌సభ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో రాయ్‌గఢ్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఎంపీ అయ్యారు. అలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర రాష్ట్ర, ఉక్కు గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పదవిని పొందారు.

 

విష్ణు దేవ్ 27 మే 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. 2 డిసెంబర్ 2022 జాతీయ కార్యవర్గ సభ్యుడు అయ్యారు. 8 జూలై 2023న ఆయన జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించబడ్డారు. 2020లో రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ బలమైన రాజకీయ జీవితం కారణంగా, బీజేపీ ఈ రోజు ఆయనకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. 59 ఏళ్ల విష్ణు దేవ్ సాయి తండ్రి పేరు రామ్ ప్రసాద్ సాయి, తల్లి పేరు జష్మణి దేవిని వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు కౌసల్యా దేవి. ఆయనకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆయనలోని విశేషమేమిటంటే.. ఎంపీగా ఉన్నప్పటికీ విష్ణు దేవ్‌సాయి ఊరు విడిచి వెళ్లకుండా ఇప్పటికీ తన ఊరు బాగియాలోని ఇంట్లోనే ఉంటున్నారు.