NewDelhi, September 13: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం నింపే ఉద్దేశంతో ఓ యాడ్‌ఫిల్మ్ రూపొందించారు. అందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. ఆరు బ్యాగులున్న కారు సురక్షితమని చెప్పేందుకు నిమిషం నిడివితో దీనిని రూపొందించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ దీనిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే, ఈ యాడ్ వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ యాడ్ లో ఏముందంటే.. పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్తున్న కుమార్తె, అల్లుడు విచారంగా కనిపిస్తారు. కారణం ఆ కారులో రెండు ఎయిర్ బ్యాగులు ఉండడమే. అప్పుడు ప్రత్యక్షమైన పోలీస్ అధికారి (అక్షయ్ కుమార్) ఇలాంటి వాహనంలోనా అమ్మాయిని అత్తారింటికి పంపేది అని ఆమె తండ్రిని ప్రశ్నిస్తాడు. దానికతడు బదులిస్తూ.. ఆ కారులో ఉన్న ప్రత్యేకతలు గురించి చెబుతాడు. అత్యాధునిక మ్యూజిక్ సిస్టం ఉందని చెబుతాడు. కల్పించుకున్న అక్షయ్ కుమార్.. కానీ అందులో ఉన్నవి రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమేనని చెప్పడంతో అందరూ షాకవుతారు. అమ్మాయి, అబ్బాయి కారు దిగిపోతారు. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారు సురక్షితమని అక్షయ్ చెప్పడంతో వెంటనే మరో కారు వచ్చేస్తుంది. కొత్త జంట ఆనందంగా ఆరు ఎక్కి టాటా చెప్పి వెళ్లిపోతుంది.

 

అయితే, ఈ యాడ్‌పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరకట్నాన్ని ఇది ప్రోత్సహించేలా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే ఖరీదైన ఆరు ఎయిర్ బ్యాగులున్న వాహనంలో వెళ్లమని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి కారు కొనుక్కునేందుకు వరకట్నం కోసం డిమాండ్ చేసేలా ఉందని కూడా మండిపడుతున్నారు. శివసేన నాయకురాలు ప్రియాంకా చతుర్వేది, టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే వంటి వారు ఈ యాడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.