Tirupati, Jan 9: తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో తీవ్ర అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో ఆరు మంది చనిపోగా పలువురికి గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు . ఇదొక దురదృష్టకర సంఘటన చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు.
సమీక్షా సమావేశాలలో, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని టిటిడి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తనను ఫోన్లో సంప్రదించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, టిటిడి నిర్వహణలోపంతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారుల ఘోర వైఫల్యం వల్లే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుందని స్పష్టం చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. “ఏదైనా ఇబ్బంది ఉండవచ్చని నాకు అనుమానం ఉంది, కాబట్టి నేను ఈ విషయంలో టిటిడి అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం' అని ఆయన తెలిపారు.
TTD chairman BR Naidu on Tirupati Stampede:
టీటీడీ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. దీనికి మనం ఎవరిని నిందించలేము
చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదు
నేను ముందే చెప్పాను.. పోలీసులు మేము చూసుకుంటామని చెప్పారు
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు..#TTD #TirumalaTemple #TirupatiStampede @BollineniRNaidu @TTDevasthanams https://t.co/dsrTLHDotZ pic.twitter.com/ZV2Qq1HUO4
— Telangana Awaaz (@telanganaawaaz) January 9, 2025
కాగా భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విష్ణు నివాసం, బైరాగి పట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట జరిగింది. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూలైన్లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది.
క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ (TTD) ఈవో శ్యామలరావు
తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ (TTD) ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఇందులో 41 మందికి గాయాలయ్యాయని, ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జి చేసినట్లు ఈవో చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని.. చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారన్నారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు.