ఫ్యామిలీ గొడవలతో సీనీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి విదితమే. ఈ గొడవలను కవరేజ్ చేసేందుకు జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి జర్నలిస్టులు వెళ్లినప్పుడు ఒక రిపోర్టర్ పై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ దాడిలో సదరు రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది.
ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
మోహన్ బాబు తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ... కుమారుడితో గొడవ నేపథ్యంలో దాడి ఘటన జరిగిందని చెప్పారు. కావాలని ఆ పని మోహన్ బాబు చేయలేదని తెలిపారు. జరిగిన దానికి సదరు జర్నలిస్టుకు మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పారని... పరిహారం చెల్లించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మోహన్ బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధులు ట్రెస్ పాస్ చేశారని తెలిపారు. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ... ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా? అని ప్రశ్నించింది.