Credits: Twitter

Hyderabad, DEC 28: ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల (Traffic Challans) చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు (Traffic Challan) అయ్యాయని.. దీంతో రూ.8.44కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ.2.62 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా 1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93వేల చలాన్ల ద్వారా రూ.76.79 లక్షల ఆదాయం చేకూరిందని పేర్కొన్నాయి. కాగా, పెండింగ్‌ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్‌లు ప్రకటించడంతో గడువులోగా కట్టేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు.

 

దీంతో తరచూ సర్వర్‌ హ్యాంగ్‌ అవుతోంది.పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూలు (Pending Traffic Challan Payments) విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది.

 

వివరాల ప్రకారం.. ట్రాఫిక్‌ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. జనవరి 10వ తేదీ వరకు చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు.