Rama-Navami-2024-Wishes-in-Telugu_1

Hyderabad, April 17: నేడు నగరంలో జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర (Shobha Yatra) సందర్భంగా గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఠాణా పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సీతారాంబాగ్‌ ఆలయం వద్ద శోభయాత్ర ప్రారంభమై..సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్‌ వ్యాయమశాల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ వెల్లడించారు. కాగా, శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు యాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఉండే ప్రార్థన మందిరాలు బయటకు కనిపించకుండా పరదాలతో మూసేశారు.

 

మతపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పండుగల సందర్భంగా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంటారు. శ్రీరామ నవమి శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ యాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ భగవంత్‌రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్‌రాఠి పిలుపునిచ్చారు.