Hyderabad, June 17: తెలంగాణలో బుధవారం మరో 269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 5,675 కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 1096 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక హైదరాబాద్ లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ఈరోజు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 214 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి నుంచి 13, వరంగల్ అర్బన్ నుంచి 10, మెదక్ నుంచి 13, కరీంనగర్ నుంచి 8, జనగాం నుంచి 5 , ములుగు నుంచి 5, సంగారెడ్డి 3, మెదక్ 3, మేడ్చల్ నుంచి 3, వనపర్తి 2, వికారాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ మరియు వికారాబాద్ జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
బుధవారం మరొక కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 192 కు పెరిగింది.
Telangana's #COVID19 Report:
ఇదిలా ఉంటే, ఈరోజు మరో 151 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,171 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు?? ప్రస్తుతం రాష్ట్రంలో 2,412 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు 45,911 ?? మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
- అయితే నిన్న విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఇవ్వబడిన గణాంకాలు, ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఇవ్వబడిన గణాంకాలను గణిస్తే, మొత్తం చేయబడిన వైద్య పరీక్షల వివరాలు మరియు డిశ్చార్జ్ చేయబడిన వారి సంఖ్యలో కొంత అస్పష్టత కనిపిస్తుంది. అలాగే నేటి రిపోర్ట్‌లో ఆరోగ్య శాఖ అధికారులు 1959 మంది కేసుల వివరాలు ఇంకా పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిపై అధికారులు మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.