Tirupati, Jan 9: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satyaprasad) తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.ఆపై మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటనలో (Tirupati Stampede) కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన (Stampede in Tirupati) జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యా? సమన్వయా లోపమా? అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వారు కూడా డిశ్చార్జి అవుతారని చెప్పారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులను పరామర్శిస్తారని కలెక్టర్ వివరించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అవడంతో.. వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసులు తరలిస్తున్నారు.