Artemis 1 launch: చంద్రుడిపై శాశ్వత నివాసం కోసం నాసా కీలక ప్రయోగం, ఇప్పటికే రెండు సార్లు ఫెయిలయిన నాసా, ఈ రోజైనా సక్సెస్ అయ్యేనా! నాసా ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచదేశాలు
Artemis 1 Image Credit @ NASA Twitter

New York, NOV 16: చంద్రుడిపైకి ఆర్టెమిస్-1ను (Artemis 1) ప్రయోగించేందుకు నాసా (NASA) మరోసారి సిద్ధమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రారంభంలోనే విఫలమైన ఈ ప్రయోగం.. ఈసారి విజయవంతం అవుతుందని నాసా శాస్త్రవేత్తలు గట్టినమ్మకంతో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 11.34గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు నాసా (NASA) వెల్లడించింది. కేప్ కెనావెరల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది. 2024లో ఆర్టెమిస్‌-2 (Artemis 2) ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి (Moon) తీసుకెళ్లాలని నాసా భావిస్తుంది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది. అయితే, ప్రస్తుతం ఈ మిషన్‌లోని ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవ రహితంగానే చంద్రుడి కక్ష్యలోకి (Moon orbit) వెళ్లిరానున్నది. ఆర్టెమిస్‌-3ని 2025 ప్రయోగించేందుకు నాసా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తరువాత మళ్లీ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నం జరగలేదు. అయితే నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరెమిస్-1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో నాసా తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది.

ఈ ఏడాది ఆగస్టు 29న కొన్నిఅనివార్య కారణాలతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారు. మళ్లీ సెప్టెంబర్ 3న ఆర్టెమిస్-1 ప్రయోగంకు అంతా సిద్ధంచేసిన తరువాత లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో ఇంధనం లీక్ (Fuel leak) అవుతున్నట్లు గుర్తించారు. సూపర్‌ కోల్డ్‌ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ లీక్ అవుతుండటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. మళ్లీ నేడు ఉదయం 11.34గంటలకు నాసా ఈ ప్రయోగాన్ని తలపెట్టింది. గతంలో రెండు సార్లు ప్రయోగం ప్రారంభంలోనే విఫలం కావటంతో ఈసారైనా నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం సఫలమవుతుందా..? మరోసారి వాయిదా పడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.