Islamabad, March 26: పాకిస్థాన్‌లోని (Pakistan) రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్ పీఎన్‌ఎస్ సిద్ధిఖ్‌పై సోమవారం రాత్రి దాడి జరిగింది. పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో స్థావరంపై (Terrorists Attack) విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు తీవ్రవాదులను హతమార్చారు (4 Terrorists Killed). ఎయిర్‌స్టేషన్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం.
#Breaking#Pakistan's second-largest airbase, PNS Siddique, came under attack by multiple explosions and gunfire, according to several media reports.
The Balochistan Liberation Army (#BLA) has claimed responsibility for the assault on the Naval Airbase in Turbat, citing… pic.twitter.com/WSk0itrVYw
— TIMES NOW (@TimesNow) March 26, 2024
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)’ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కాల్పుల్లో డజను మంది పాకిస్థానీ బలగాలు మృతిచెందినట్లు తెలిపింది. పాకిస్థాన్ సైన్యం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వారం రోజుల్లో ఈ ముఠా ఈ తరహా దాడికి యత్నించడం ఇది రెండోసారి. మార్చి 20న గ్వాదర్ పోర్టుపైనా ముష్కరులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురిని హతమార్చాయి. బీఎల్‌ఏను పాకిస్థాన్ సహా అమెరికా, యూకే ఉగ్రసంస్థగా గుర్తించాయి. తుర్బత్‌లో ఉన్న పీఎన్‌ఎస్ సిద్ధిఖ్‌లోకి ప్రవేశిస్తుండగానే తిరుగుబాటుదారులను గుర్తించి మట్టుబెట్టామని అక్కడి అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్ (Baluchistan) అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న విషయం తెలిసిందే.