Rupert Murdoch and Elena Zhukova (Photo Credit: X)

New York, March 08: ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవా (Elena Zhukova)ను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా, ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వృద్ధ జంట వివాహం చేసుకోబోతోందంటూ స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మార్దోక్‌ ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది. రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది రెండో వివాహం. గతంలో మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో ఆమెకు వివాహమైంది. కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ కుమార్తె దాషా కూడా ఉంది. ఆమె రష్యన్‌ ఓలిగార్క్‌ను పెళ్లి చేసుకుని విడిపోయింది.

 

కాగా, మర్దోక్ ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకొని వారితో తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ (Ann Lesley Smith)తో ఎంగేజ్మెంట్‌ చేసుకున్నారు. మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో వీరి ఎంగేజ్మెంట్‌ ఘనంగా జరిగింది. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు’ అని నిశ్చితార్థం సమయంలో రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయన లెస్లీతో నిశ్చితార్థం చేసుకొని అప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే నిశ్చితార్థం అయిన వారాల వ్యవధిలోనే వీరి బంధం తెగిపోయింది. లెస్లీ స్మిత్‌ అభిప్రాయాల విషయంలో మర్దోక్‌ అసౌకర్యానికి గురయ్యారని అందుకే లెస్లీతో వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ (Patricia Booker)ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్‌ (Anna Maria) ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ (Wendi Deng )ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్‌ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. కాగా, రెండో భార్య అన్నా మరియా మన్‌ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.