Srinagar, October 30: జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల (MEP) బృందంలో ఒకరైన యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు బెర్న్‌హార్డ్ జిమ్నియోక్ (Bernhard Zimniok) మాట్లాడుతూ, భారత్ మరియు పాకిస్తాన్ అంగీకరిస్తే, కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వర్తించేందుకు యూరప్ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తితలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మరియు రెండు దేశాల మధ్య శాంతిని పెంపొందించడానికి యూరోప్ నిజాయితీగల మధ్యవర్తిగా వ్యవహరించాలి అని పేర్కొన్నారు.
ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత కాశ్మీర్ లోయను సందర్శించటానికి వచ్చిన మొదటి విదేశీ ప్రతినిధులు బృందం ఇదే. ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణ జనజీవనం ఎలా ఉంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి లాంటి అంశాలను యూరోపియన్ ఎంపీలు భారత ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, శాంతి పరిరక్షణ, మానవ హక్కులు మరియు నిరాయుధీకరణ వంటి అనేక అంశాలపై కూడా ఈ బృందం చర్చించింది.
అంతకుముందు వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (NSA Ajit Doval) తో కూడా సమావేశమయ్యారు. కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వంతో పాటుగా, భారత్- యూరోప్ దేశాల మధ్య సంబంధాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే గతంలోనే పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ అంశంలో తాను ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తానన్నప్పుడు, అది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదని ప్రధాని మోదీ సూటిగా సమాధానం ఇచ్చారు. పలు అంతర్జాతీయ వేదికలపైనా, కాశ్మీర్ అంశం పూర్తిగా తమ వ్యవహారం ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని మోదీ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్ తర్వాత మళ్ళీ యూరోప్ ఎంపీల నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.
యూరోపియన్ ఎంపీల బృందం కాశ్మీర్ పర్యటన నేపథ్యంలో ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాలలో గల మత, సాంస్కృతిక వైవిధ్యం గురించి యూరోపియన్ ఎంపీలకు సరైన అవగాహన కల్పించటమే కాకుండా ఆర్టికల్ రద్దు తర్వాత ఈ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ఒక స్పష్టమైన అభిప్రాయం కల్పించేందుకు ఉపయోగపడుతుందని పీఎం కార్యాలయం తెలిపింది.