Imran Khan (Photo Credit- Facebook)

Lahore, DEC 20: జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని పీఐటీ (PTI) బుధవారం ప్రకటించింది. తోషాఖానా అవినీతి కేసులో కోర్టు ఆగస్టు 5న దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కొద్ది రోజుల తర్వాత ఇస్లాబాద్‌ హైకోర్టు మూడేళ్ల శిక్షను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే, ఇతర కేసుల్లో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలులోనే ఉంచింది. అయితే, ఇమ్రాన్‌ (Imran Khan) మూడు ఎంపీ స్థానాల నుంచి ఎన్నికల్లో బరిలోకి దిగుతారని బారిస్టర్‌ అలీ జాఫర్‌ అడియాలా జైలు వద్ద మీడియాకు తెలిపారు.

 

తోషాఖానా కేసును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పును ఇవ్వబోతుందని, ఎన్నికల షెడ్యూల్‌ విడులైనందున త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఆశిస్తున్నామన్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని పీటీఐ కార్యకర్తలకు ఇమ్రాన్‌ సూచించినట్లు పేర్కొన్నారు. వందశాతం పార్టీ కార్యకర్తల ప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థులు ఖరారయ్యారని, త్వరలోనే పేర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.