World Health Organization (File Photo)

New Delhi, OCT 06: భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను (Cough Syrups) వాడొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలలో ఈ సిరప్‌లు (Cough Syrups) మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపింది. దీనిపై భారత ప్రభుత్వం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ (WHO) పేర్కొంది. ఇటీవల గాంబియా (Gambia)దేశంలో 66 మంది పిల్లలు మరణించారు. ఈ మరణాలకు భారతీయ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్ (Promethazine Oral Solution), కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్ (Kofexmalin Baby Cough Syrup), మాకోఫ్ బేబీ కఫ్ సిరప్ (Makoff Baby Cough Syrup), మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ( Magrip N Cold Syrup) అనే నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నాయని, ఇవి మానవులకు విషపూరితమైనవి అని తెలిపింది.

గాంబియాలోని ఉత్పత్తుల్లో వీటిని గుర్తించామని, ఇతర దేశాలకు కూడా ఇవి పంపిణీ చేసి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ గ్యాబ్రియేసిన్ మాట్లాడుతూ.. మెడైన్ ఫార్మా ఉత్పత్తులపై (Maiden Pharmaceuticals Limited) ఆ కంపెనీ, నియంత్రణ అధికారులతో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

US: యుఎస్‌లో 8 నెలల చిన్నారి సహా నలుగురు భారతీయులు కిడ్నాప్, అత‌ను ప్రమాదకరమైనవాడని తెలిపిన పోలీసులు 

ఈ ఉత్పత్తుల సరఫరా నిలిపివేయాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది.  భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI), భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇదిలాఉంటే భారతీయ ఫార్మా కంపెనీ తయారు చేసిన కలుషిత దగ్గు సిరప్ కారణంగా పిల్లలు చనిపోవడం ఇది మొదటి ఉదాహరణ కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో మరో భారతీయ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందు కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో 14 మంది పిల్లలు మరణించారు.