
Khatmandu, DEC 25: నేపాల్‌లో గతకొద్దిరోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి (Nepal Crisis) తెరపడినట్లు తెలుస్తోంది. నేపాల్ నూతన ప్రధానిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) (Prachanda) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరు పార్టీల సంకీర్ణం ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించడంతో ఆయన నేపాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆదివారం సాయంత్రం నేపాల్ అధ్యక్ష కార్యాలయానికి వెళ్లిన ప్రచండ.. ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీని కలిశారు. ఆరు పార్టీల సంకీర్ణం తరపున ప్రధాని అభ్యర్థిని తానేనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నానని తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తును అందజేశారు. ఆమె ఆమోదంతో ప్రచండ నేపాల్ ప్రధాని (Nepal PM) బాధ్యతలు చేపడతారు. నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) (Prachanda) కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. ప్రధాని విషయంలో పలు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Nepal President appoints Pushpa Kamal Dahal as the new Prime Minister: Nepal President's Office pic.twitter.com/ZnoWMTaxxb
— ANI (@ANI) December 25, 2022
అయితే, నేపాల్ ప్రభుత్వం ఏర్పాటుపై ఆదివారం ఆరు పార్టీలు సంకీర్ణం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విధాల చర్చల అనంతరం ప్రధాని పదవిని పంచుకోవటం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తొలుత రెండున్నరేళ్లు నేపాల్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ప్రధానిగా కొనసాగుతారు.
రెండున్నరేళ్ల తరువాత సీపీఎన్ – యూఎంఎల్ కూటమి (CPL-UML) ప్రధాని పదవి చేపట్టనుంది. ఈ విషయాన్ని సమావేశం అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) నేత బర్హమాన్ పున్ మీడియాకు వివరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎన్ – యూఎంఎల్‌కు 78 స్థానాలు రాగా, మావోయిస్ట్ సెంటర్ కు 32, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి 20, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి 14 మంది, జనతా సమాజ్ వాది పార్టీకి 12, జనమత్ పార్టీకి 6, నాగరిక్ ఉన్ముక్త్ పార్టీకి నాలుగు ఎంపీల బలం ఉంది. దీంతో మొత్తం ఎంపీల బలం 166గా ఉంది. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 138 సీట్లు అవసరం ఉంటుంది.