TikTok Is Banned In The US(file Photo)

చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది.టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది టిక్ టాక్. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అమెరికాలో టిక్‌టాక్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ బైట్‌డ్యాన్స్‌ ప్రకటించడం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. కాగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరిస్తామని ట్రంప్‌ ప్రకటించారు.

తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ

లక్షలాది మంది అమెరికన్లు ఈ యాప్‌పై ఆధారపడ్డారని.. అందుకే నిరంతరం ఈ యాప్‌ అందుబాటులో ఉండేలా మధ్యవర్తిత్వం వహిస్తామని తెలిపారు. అమెరికాలో తమ సేవలను పునరుద్ధరణపై ట్రంప్‌ నుంచి భరోసా లభించడంతో ఆయనకు టిక్‌టాక్‌ ధన్యవాదాలు తెలిపింది. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ కంపెనీ 2017లో టిక్‌టాక్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్‌ దక్కించుకుంది.

అమెరికాలో టిక్‌టాక్‌కు దాదాపు 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. టిక్‌టాక్‌ను 2025 జనవరి 19వ తేదీలోగా అమెరికా కంపెనీకి విక్రయించాలని గతేడాది ఏప్రిల్‌లో అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లును ఆమోదించింది.తాజాగా ఆ గడువుకు ఒక్కరోజు ముందుగానే తమ సేవల్ని అమెరికాలో ఆపివేస్తున్నట్లు టిక్‌టాక్‌ ప్రకటించింది. తాజాగా ట్రంప్‌ మద్దతుతో టిక్‌టాక్‌ తన సేవలను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.