Donald Trump (Photo-X)

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్‌ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు. అందరి మధ్యన అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు.

78 ఏళ్ల ట్రంప్‌ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్‌, అలాగే తన బైబిల్‌ను చేతిలో పట్టుకొని ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

అమెరికాలో ట్రాన్స్‌జెండర్లకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్, పాస్‌పోర్ట్‌తో సహా IDలలో మగ లేక ఆడ మాత్రమే ఉండాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ

ఈ వేడుకలో అమెరికా సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది జడ్జిలు ఈ వేడుకకు హాజరయ్యారు. ట్రంప్‌ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న నేతలతో పాటు వివేక్‌ రామస్వామి, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, మార్క్‌ జుకర్‌ బర్గ్‌, టిమ్‌ కుక్‌, సుందర్‌ పిచాయ్‌ తదితరులు పాల్గొన్నారు.ఇక బిల్‌ క్లింటన్‌, హిల్లరీ క్లింటన్‌, జార్జి డబ్ల్యూ బుష్‌, లారా బుష్‌ తదితరులు విచ్చేశారు. బరాక్‌ ఒబామా హాజరైనప్పటికీ మిచెల్లీ ఒబామా మాత్రం ఈ వేడుకకు రావడంలేదని ముందే ప్రకటించారు.

Donald Trump Takes the Oath of Office 

ఇండియా తరఫున ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున హాజరైన జైశంకర్‌.. ట్రంప్‌నకు నరేంద్ర మోదీ రాసిన లేఖను అందజేయనున్నారు.ఈ వేడుకకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు సైతం హాజరయ్యారు.