Megastar Chiranjeevi and jagan and BJP Logo (Photo-Insta)

Vjy, July 10: ఏపీలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో నటుడు చిరంజీవి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. ఆయన వ్యాఖ్యలు నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వారి పేర్లు ప్రస్తావించకుండా చిరంజీవి విమర్శలు చేసినా అవి వైసీపీ పార్టీని లక్ష్యంగా చేసుకోవడమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ప్రతి విమర్శలకు దిగారు.ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, వైసీపీ నాయకులు చిరంజీవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొడాలి నాని ప్రతి పకోడి గాడు మాకు సలహాలిచ్చేవాడేననే వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు భగ్గుమంటున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పరుష పదజాలంతో మాట్లాడారని ఆరోపిస్తూ చిరంజీవి అభిమానులు గుడివాడలో ఆందోళనకు దిగారు.

వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని

చిరంజీవి వ్యాఖ్యలు వెనుక కథకు కారణం తెలియాలంటే ముందుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించిన వ్యాఖ్యల దగ్గరకు వెళ్లాల్సిందే. ఇంతకీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఏమన్నారు.

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రసంగం ఓ సారి చూస్తే..

2023 జూలై 27న సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు సందర్భంగా హీరోల రెమ్యూనరేషన్ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.పెద్ద సినిమాల బడ్జెట్‌లో అధిక భాగం హీరోల రెమ్యునరేషన్‌కే వెళుతోంది. సినిమా బడ్జెట్‌లో దాదాపు మూడో వంతు హీరోలకే వెళుతోంది. సినిమా అంటే హీరో ఒక్కడే కాదు. భారత చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు నామమాత్రంగా వేతనాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకు కేంద్రం తన వంతు చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యల తర్వాత వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి ఏం అన్నారు?

‘ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది. వాళ్ల ఫ్యామిలీస్ ఆనందంగా ఉంటాయి. సినిమా వాళ్లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్లకేం పనీపాటా లేదా? అనిపిస్తుంది. సర్, సినిమాలు చేస్తున్నామంటే బిజినెస్ అవుతుంది కాబట్టే. అందుకే డబ్బులు ఇస్తున్నారు. సినిమా మీద సినిమా తీస్తున్నామంటే మాకు డబ్బులు వస్తాయని కాదు సర్. మా వాళ్లకు ఉపాధి లభిస్తుందని. దేశంలో ఇంతకుమించి సమస్యన్నదే లేనట్టు పార్లమెంటులో కూడా దీని గురించి మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరం. సినిమాను దూరంగా ఉంచండి. మా కష్టాలేవో మేం పడతాం.

చిరంజీవి భోళాశంకర్ మూవీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిరాకరించిన జగన్ సర్కారు

ఆదరిస్తే సంతోషం. మేం ఖర్చు చేస్తున్నాం కాబట్టే తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఇంత ఖర్చు చేస్తున్నందుకు ఎంతో కొంత రావాలని కోరుకుంటాం. వీలైతే సహకరించండి. అంతేకానీ, ఇదేదో పెద్ద తప్పన్నట్టు దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దని విన్నవించుకుంటున్నాను. రాజకీయ నాయకులతో పోలిస్తే సినిమా ఎంతండీ. చాలా చిన్నది. నేను అదీ చూశాను.. ఇదీ చూశాను.

Here's Chiranjeevi Comments Video

మీలాంటి వాళ్లు పెద్దపెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడం వంటి వాటి గురించి తలవంచి నమస్కరిస్తాం. అంతేకానీ, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై ఏంటి సర్’’ అని చిరంజీవి ఆ ఫంక్షన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న చిరంజీవి వ్యాఖ్యలు, జనసేనకు సపోర్ట్ చేస్తారనే వార్తలకు ఈ కామెంట్లు బలం చేకూరినట్లేనా..

ఈ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియాలో పెద్దఎత్తున చిరంజీవి మీద దుమారం రేగింది. ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం పేరు చెప్పకపోయినా, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రులు చిరంజీవి వ్యాఖ్యలపై వరుసగా కౌంటర్లు విసిరారు.

ఇంతకీ వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు ఎవరేమన్నారో చూద్దాం.

బొత్స సత్యనారాయణ: చిరంజీవి ఉద్దేశమేంటి? సినీ పరిశ్రమ పిచ్చుక అనా? దానిపై బ్రహ్మాస్త్రం వేయొద్దని అంటున్నారా.. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో దాని వెనుక ఏముందో నాకు తెలియదు. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. సినిమాపై ఎందుకు పనిచేస్తుంది’’ అని అన్నారు.

గుడివాడ అమర్నాథ్: చిరంజీవి రాజకీయాలను కడిగే ముందు ఆయన తన తమ్ముడిని కడిగితే మంచిది. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా? ’’ అని అన్నారు.

మాజీ మంత్రి పేర్ని నాని: ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయం ఎంత దూరమో, ఇక్కడ నుంచి ఫిల్మ్‌నగర్ కూడా అంతే దూరం. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారు. అలాంటప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదు’’ అని చెప్పారు. చిరంజీవి రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడైనా ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్ని నాని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో వున్నారు అంటూ ఆయన నిలదీశారు.ఎవరైనా సినిమాను సినిమాగా చూడాలి.. రాజకీయాలను రాజకీయంగా చూడాలని పేర్ని నాని చురకలంటించారు. దాడికి ఎదురుదాడి సహజమని.. గిల్లితే , గిల్లించుకోవాల్సిందేనని పేర్నినాని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరి ప్రభుత్వమని చిరంజీవిపై మండిపడ్డారు. అప్పుడు నా హీరో కేంద్ర మంత్రిగా వున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి కొడాలి నాని: సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లున్నారని, ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారంటూ కొడాలి ఫైర్ అయ్యారు. అలాగే పకోడీ గాళ్లు సలహాలు తనవాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లు తమ వారికి రాజకీయాలు ఎందుకు, డాన్స్, ఫైట్స్ యాక్షన్ మనం చూసుకుందాం అని చెప్పొచ్చు కదా అంటూ చిరంజీవిని, సోదరుడు పవన్ ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు

మంత్రి రోజా: చిరంజీవి, మహేష్ బాబు & ప్రభాస్ లాంటి సినిమా హీరోలంతా కలిసి... వాళ్లకేం అర్హత ఉందని ఆ రోజు మా జగన్ మోహన్ రెడ్డి దగ్గరకొచ్చి టికెట్ రేట్లు పెంచమని "అడుక్కున్నారు"?

ఇక చిరంజీవికి మద్దతుగా బీజేపీ పార్టీ కూడా రంగంలోకి దిగింది. చిరంజీవి అన్న మాటల్లో తప్పేముందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.సినిమాలు గురించి చర్చ ఎందుకు? పేదవారి కడుపు నింపండి, అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు ఇందులో తప్పేముంది! అంటూ ప్రశ్నించారు.

Here's Vishnu Vardhan Reddy Tweet

చిరంజీవి వ్యాఖ్యలు తొలగించిన ప్రమోటింగ్ ఏజెన్సీ

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చిరంజీవి వ్యాఖ్యలు, వైసీపీ మంత్రుల విమర్శలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ప్రమోటింగ్ ఏజెన్సీ తొలగించింది. వాల్తేరు వీరయ్య ఫంక్షన్ వీడియో లింకులో ఆ వ్యాఖ్యలు లేకుండా చేశారు. అయితే, అప్పటికే సెల్ ఫోన్లో రికార్డు చేసిన విజువల్స్ బయటకు రావడంతో ఈ వ్యాఖ్యలపై అగ్గి రాజుకుంది.

ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ వివాదం

ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ వివాదం ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కిందట టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడిచింది.ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా హాళ్లలో టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం 2021 ఏప్రిల్ 8న జీవో నం.35ను జారీ చేసింది. టికెట్లను ప్రభుత్వం తరఫున విక్రయించాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ జీవోపై పెద్ధ ఎత్తున చర్చ నడిచింది. టికెట్ ధరలు బాగా తక్కువగా ఉన్నందున థియేటర్ నిర్వహణ సాధ్యం కాదని థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం తెలిపాయి.

తెనాలికి చెందిన లక్ష్మీ, శ్రీలక్ష్మీ థియేటర్ యాజమాన్యం సహా పలు థియేటర్ల యాజమాన్యాలు ఈ జీవోపై హైకోర్టులో కేసు వేశాయి. వందల కోట్లు ఖర్చు చేసే సినిమాలకు నామమాత్రపు ధరలు నిర్ణయిస్తే మనుగడ సాగించలేమంటూ థియేటర్ల యాజమాన్యాలు కోర్టులో వాదనలు వినిపించాయి. తనపై ఉన్న కోపంతో సినిమాలపై పగ తీర్చుకోవద్దంటూ పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత, ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను ఏపీ హైకోర్టు 2021 డిసెంబరు 15లో కొట్టేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ వేసి టికెట్ల రేట్ల పెంపుపై అధ్యయనం చేసింది.

అప్పట్లో చిరంజీవి నేతృత్వంలోని బృందం, టికెట్ల తగ్గింపు వివాదంపై ఏపీ ప్రభుత్వంతో చర్చించింది. చిరంజీవితోపాటు మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, అల్లు అరవింద్, ఆర్.నారాయణమూర్తి తదితరులు 2022 ఫిబ్రవరి 11న ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి ఏపీ సీఎంను కలిశారు. ఆ తర్వాత టికెట్ల రేట్లను పెంచుతూ గతేడాది మార్చి 7న ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఈ జీవో విషయంలోనూ వివాదం నడిచింది. అప్పట్లో ఫిబ్రవరిలో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తర్వాతే జీవో తీసుకువచ్చారని అప్పట్లో పవన్ అభిమాన సంఘాలు విమర్శించాయి.

బ్రో సినిమా వివాదానికి చిరంజీవి వ్యాఖ్యలకు సంబంధం ఉందా..

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలైంది. ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి స్పూఫ్ చేశారనే వివాదం నడుస్తోంది. రాంబాబు పేరును పోలినట్లుగా శ్యాంబాబు పేరుతో నటుడు పృథ్వీ, బ్రో సినిమాలో పాత్ర పోషించారు. గతంలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాలలో పాల్గొని డ్యాన్స్ చేశారు. అదే డ్రెస్సులో.. దాదాపు అవే స్టెప్పులు వేస్తూ నటుడు పృథ్వీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది.

సినిమా విడుదలయ్యాక శ్యాంబాబు పాత్రపై అభ్యంతరం చెబుతూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్స్ పెట్టారు. పవన్ కల్యాణ్ , సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పవన్‌ను ఉద్దేశించి ‘ఎంఆర్ఓ’ సహా వివిధ పేర్లతో ఓ సినిమా తీస్తున్నట్లు వారం కిందట ప్రెస్ మీట్లో చెప్పారు. దీనిపై కథ, కథనం తయారుచేస్తున్నారన్నారు.

చిరంజీవి వ్యాఖ్యలు వెనుక ఏదైనా వ్యూహం దాగుందా.. ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కర అంశంగా మారింది. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) పెట్టిన చిరంజీవి.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన.. ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.

తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా ఎప్పుడూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. జనసేనకు మద్దతుగా కాని.. వ్యతిరేకంగా కాని ఎక్కడా మాట్లాడలేదు. చివరికి తన తల్లిని తూలనాడినా రాజకీయంగా చూశారే గాని.. రాజకీయాలతో సంబంధం లేని తల్లిని ఎందుకు అవమానిస్తారని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఉన్నట్టుండి.. అదీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ ప్రజల చిరకాల వాంఛగా మిగిలిన ప్రత్యేక హోదాపై గళం విప్పడం రాజకీయంగా ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనని చెప్పవచ్చు. చిరంజీవి వ్యాఖ్యలకు బీజేపీ నుంచి మద్దతు రావడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.