
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2023-2024కి సంబంధించిన అన్ని సాధారణ ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల (APSCHE Exam Calendar 2023-24) చేసింది. అభ్యర్థులు మొత్తం APSCHE పరీక్షా క్యాలెండర్ 2023-24ను ఓ సారి ఈ కథనంలో చెక్ చేసుకోవచ్చు. కౌన్సిల్ ప్రస్తుతం AP కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఇది జనవరి 31, 2023 నాటికి పూర్తి అవుతుంది.
12వ తరగతి పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు వివిధ ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను తనిఖీ చేయడానికి APSCHE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీ సెట్)ను మే 15 నుంచి (AP EAPCET 2023 likely on May 15) నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశపరీక్షలు ఉంటాయి.
రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇతర ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్లను గతంలో కన్నా ముందుగా నిర్వహించి.. త్వరగా ప్రవేశాలు పూర్తి చేసేలా షెడ్యూళ్లను రూపొందించింది. ఈసారి ఈఏపీసెట్ పరీక్షలను గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే ప్రారంభించనుండడం విశేషం.
దీనివల్ల జూన్ ఆఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం పక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. పైన పేర్కొన్న షెడ్యూల్ తాత్కాలికమైనదని విద్యార్థులు గమనించాలి. వివరణాత్మక, చివరి షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ - cets.apsche.ap.gov.inలో త్వరలో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు.