Amaravati, Sep 12: పశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది.ఇది ఆదివారం తెల్లవారుజామున వాయుగుండంగా మారి గోపాలపూర్ తీరానికి చేరువైంది. తర్వాత దిశ మార్చుకుని పశ్చిమ, ఉత్తర పశ్చిమ దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (IMD) అధికారులు తెలిపారు.మరో 24 గంటల్లో ఇది క్రమేపీ బలహీనపడుతుందని వెల్లడించారు.
దీని ప్రభావ మరో 24 గంటలు ఉంటుందని, ముందు జాగ్రత్తగా గోపాలపూర్, ధమ్రా, పరదీప్ ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. 13 వరకు చేపల వేట నిషేధించామన్నారు. సముద్ర ఉపరితలంలో గాలులు తీవ్రత గంటకు 40-50 కిలోమీటర్లుగా ఉందన్నారు. కడలిలో అలలు ఉద్ధృతి కొనసాగుతున్నట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. నేడు నవరంగపూర్, కలహండి, కొధమాల్, నువాపడ, బొలంగీర్, బరగఢ్, కేంఝర్, మయూర్‌భంజ్, భద్రక్, జాజ్‌పూర్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచలున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో ఈ 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ప్రభావం చూపకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో (Several Districts likely to receive heavy rains) మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ జల్లులు కురవడంతో పాటు తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ (IMD's warning) తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆదివారం పాలకోడేరులో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలని వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే సెప్టెంబరు 28న కూడా ఇంకో అల్పపీడనం ఉండొచ్చన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో పీడనాలు, వాయుగుండాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు ఈ నెలలో రాష్ట్రాన్ని వీడదని, అక్టోబరు ద్వితీయార్థం వరకు కొనసాగొచ్చని చెప్పారు. సాధారణంగా జూన్ ద్వితీయార్థంలో రాష్ట్రానికి ప్రవేశించే రుతుపవనాలు సెప్టెంబరు 30 నాటికి వీడ్కోలు చెబుతాయి.