Consumer Rights: మేలుకో వినియోగదారుడా! తప్పుడు ప్రకటనిలిచ్చే సెలబ్రిటీలకు రూ. 50 లక్షల వరకు జరిమానా. వినియోగదారుల హక్కుల బిల్లు 2019కు పార్లమెంట్ ఆమోదం.
Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

New Delhi, 6th Aug: వినియోగదారుల హక్కులకు భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2019 (Consumer Protection Bill 2019)కు పార్లమెంట్ ఆమోదం లభించింది. దీని ప్రకారం ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలు, వాటిని అడ్వర్టైజ్ చేసే ప్రకటనదారులు మరియు బ్రాండ్ అంబాసిడర్లు ఇకపై బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది.

కల్తీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే, వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అందుకు బాధ్యులైన వారిపై భారీ జరిమానాలతో పాటు, జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఈ చట్టంలోని నూతన మార్గనిర్ధేశకాల ప్రకారం వినియోగదారుడికి బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి, అంతేకాకుండా వినియోగాదారుల నుంచి అందిన ఫిర్యాదులు త్వరితగతిన విచారించబడి అందుకు తగిన పరిష్కారం లభించనుంది.

ఈ నూతనంగా అమలులోకి వచ్చిన రూల్స్ ప్రకారం వినియోగదారుడికి కలిగే ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి.

వినియోగదారుడు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు:

ఈ కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు తాను నివసించే జిల్లాలోని జిల్లా వినియోగదారుల కమీషన్ లేదా రాష్ట్ర వినియోగదారుల కమీషన్ కు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అదీ కాకపోతే వస్తువు కొన్న చోటునే లేదా ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ యొక్క అధికారిక కార్యాలయంలో తమ ఫిర్యాదును అందజేసి ఆ ఫిర్యాదుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి.

నాణ్యత లేని వస్తువులకు తగిన పరిహారం అడిగే హక్కు:

లోపం ఉన్న లేదా నాణ్యత లేని వస్తువు కారణంగా వినియోగదారుడికి కలిగిన నష్టాన్ని పరిహారం రూపంలో అడిగేందుకు ఫిర్యాదు చేసే హక్కు ఉంది. అది ఎలాంటి వస్తువైనా సరే దానిని తయారు చేసిన సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సంస్థల్లో కొనుగోలు చేసే వాటిపైనా పరిహారం పొందేందుకు కొనుగోలుదారుడికి హక్కు ఉంటుంది.

తప్పుడు ప్రకటనలపైనా ఫిర్యాదు చేసే హక్కు:

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపైన, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే వారి పైన నేరుగా జిల్లా కలెక్టర్ కు లేదా వినియోగదారుల కమీషన్ ప్రాంతీయ కార్యాలం మరియు కేంద్ర వినియోగదారుల హక్కుల అధికారిక కార్యాలయానికి లెటర్ రాయటం ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినియోగదారుడు తమ వాదనను వినిపించే హక్కు:  

ఏదైనా ఫిర్యాదుపై విచారణ జరిగేటపుడు వినియోగదారుడు తనకు జరిగిన నష్టంపై సాక్ష్యాధారాలను సమర్పించడం కోసం నేరుగా డిస్ట్రిక్ట్ కమీషన్ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సాక్ష్యాధారాలు సమర్పించే అనుమతి పొందేందుకు అతడికి హక్కు ఉంటుంది.

ఫిర్యాదు తిరస్కరించబడితే కారణం అడిగే హక్కు:

వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఏ సందర్భంలోనైనా తిరస్కరణకు గురైతే దానికి కారణాన్ని అడిగే హక్కు అతడికి ఉంటుంది. దాని ప్రకారంగా 21 రోజుల్లో సంబంధిత డిస్ట్రిక్ట్ కమీషన్ వినియోగదారుడుకి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఋజువు కాబడితే, ఆ వస్తువును తయారు చేసిన సంస్థకు మొదటి సారిగా రూ. 10 లక్షల వరకు జరిమానా, మళ్ళీ రిపీట్ అయితే రూ. 50 లక్షల జరిమానాతో పాటు, 5 ఏళ్ల జైలు శిక్ష. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే వారికి సైతం ఇదే వర్తిస్తుంది. అయితే జైలు శిక్షకు బదులు వారిపై ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్ల పాటు నిషేధం విధిస్తారు. దానిని అడ్వర్టైజ్ చేసిన వారికి రూ. 10 లక్షల వరకు జరిమానా.