Cyclone in Gujarat. (Photo Credits: Twitter Video Grab)

Gujarat, June 14: బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావంతో ముందు జాగ్రత్తగా గుజరాత్ రాష్ట్రంలో 95 రైళ్లను రద్దు చేశారు. జూన్ 15వతేదీన గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్: ప్రాంతాలపై బిపర్‌జోయ్ తుపాన్ ల్యాండ్ అవుతుందని భారతవాతావరణశాఖ ప్రకటించడంతో గుజరాత్ రాష్ట్రంలో 95 రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత(Cyclone Biparjoy Intensifies) నేపథ్యంలో తాము డిజాస్టర్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ మిశ్రా చెప్పారు. భుజ్, గాంధీదామ్, పోర్ బందర్, ఓఖా ప్రాంతాల్లో పలు రైళ్లను రద్దు(Trains Cancelled) చేశామని, ఏడీఆర్ఎంలను అప్రమత్తం చేశామని రైల్వే జనరల్ మేనేజర్ చెప్పారు.

తుపాన్ వల్ల గాలి వేగం పెరగడంతో పలు రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు వివరించారు. తుపాన్ దృష్ట్యా రైల్వేల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు.తుపాన్ వల్ల అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైల్వే యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని రైల్వే బోర్డు డైరెక్టర్ శివాజీ సుతార్ చెప్పారు. భావ్‌నగర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, గాంధీధామ్‌లలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లు తెరిచి, అదనపు హెల్ప్‌లైన్ నంబర్‌లు కూడా యాక్టివేట్ చేశామని శివాజీ పేర్కొన్నారు.రైలు ఎక్కడైనా ఆగిపోతే ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు.

గుజరాత్‌లోని భుజ్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో గుజరాత్‌ ఆరోగ్య మంత్రి రుషికేశ్‌ గణేష్‌భాయ్‌ పటేల్‌ కూడా పాల్గొన్నారు.ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఢిల్లీ, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జోధ్‌పూర్, నాగ్‌పూర్ ఆసుపత్రుల నుంచి ఆరు సెంట్రల్ క్విక్ రెస్పాన్స్ మెడికల్ టీమ్‌లు రప్పిస్తున్నట్లు గుజరాత్ అధికారులు చెప్పారు.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తుపాను పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని, ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉన్నామని కేంద్ర అధికారులు వివరించారు.