Fog in Delhi (PIC@ ANI X)

New Delhi, DEC 27: దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో (NCR) పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు (blanket of fog) కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో (Delhi Airport) పాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం మూడుగంటల పాటు దృశ్యమానత సున్నాకు పడిపోయింది. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలు నమోదు కాగా.. సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువ. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు (temperature dips) చేరింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ.

 

అయితే, బుధవారం నగరంలో గాలులు వీచే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్య దిశ నుంచి మంచు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. పగటి సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఉదయం దట్టంగా పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది. చలిగాలుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

 

అయితే, జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీలో పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ముంగేష్‌పూర్‌లో 6.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లోధి రోడ్ 7 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతున్నది.

 

అలాగే, రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం పొగమంచు ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపగా.. పలు విమానాలు, రైళ్లను రద్దు చేశారు. ఉదయం పలుచోట్ల రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఎయిర్‌పోర్ట్ వాతావరణ విభాగం ప్రకారం.. రాబోయే 24 గంటలపాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 30 నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోని పలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది.