Bengaluru Cafe Blast (PIC@ PTI X)

Bangalore, March 02:  బెంగుళూరులోని రామేశ్వ‌రం కేఫ్‌(Rameshwaram Cafe)లో శుక్ర‌వారం బాంబు బ్లాస్ట్(Bomb Blast) ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్లు కూడా సైట్ వ‌ద్ద డేటా సేక‌రిస్తున్నారు. అయితే అనుమానిత వ్య‌క్తి బాంబు బ్యాగ్‌తో వ‌చ్చి.. పేలుడు ఘ‌ట‌న జ‌రిగే వ‌ర‌కు మొత్తం 86 నిమిషాల స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఉద‌యం 11:30 గంటల‌కు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బ‌స్సు దిగి కేఫ్‌కు వెళ్లాడు. సీసీటీవీ ఫూటేజ్ ద్వారా అనుమానితుడిగా భావిస్తున్న ఆ వ్య‌క్తి 11:38 గంటల‌కు ఇడ్లీ కోసం ఆర్డ‌ర్ ఇచ్చాడు. ఇక 11:44 గంటలకు ఆ అనుమానిత వ్య‌క్తి హ్యాండ్ వాష్ ఏరియాకు చేరుకున్నాడు. త‌న చేతుల్లో ఉన్న ఓ బ్యాగ్‌ను ఆ వాష్ ఏరియా వ‌ద్ద పెట్టాడు. ఆ బ్యాగ్‌లోనే పేలుడు ప‌దార్ధం ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

 

ఆ కేఫ్ నుంచి అనుమానిత వ్య‌క్తి 11:45 గంటల‌కు బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఫూట్‌పాత్‌కు బ‌దులుగా అత‌ను రోడ్డుపై న‌డుస్తూ వెళ్లాడు. వాకింగ్ పాత్‌పై పెట్టిన సీసీటీవీ కెమెరాల‌ను త‌ప్పించుకోవాల‌న్న ఉద్దేశంతో అత‌ను రోడ్డు మీద న‌డిచిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఇక మ‌ధ్యాహ్నం 12.56 గంటల‌కు రామేశ్వ‌రం కేఫ్‌లో బ్లాస్ట్ జ‌రిగింది. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. క‌స్ట‌మ‌ర్లు, సిబ్బంది ఉరుకులు ప‌రుగులు పెట్టారు. అయితే కేఫ్‌కు వంద మీట‌ర్ల దూరం త‌ర్వాత అనుమానిత వ్య‌క్తి అదృశ్య‌మైన‌ట్లు తెలుస్తోంది. కేఫ్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లిన వ్య‌క్తి ఫోన్‌లో మాట్లాడిన్లు గుర్తించారు. అయితే అత‌ను ఎవ‌రికి కాల్ చేశాడ‌న్న కోణంలో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.