Ahmadabad, DEC 08: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Gujrat Assembly Election Result 2022) వెలువడుతున్నాయి. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కూడా అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అటు హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఉత్కంఠపోరు సాగుతోంది. కాంగ్రెస్- బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. హిమాచల్‌లో (Himachal Pradesh Assembly Election Result 2022) హంగ్ వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అందుకు తగినట్లుగానే పోటా పోటీగా ఫలితాలు వస్తున్నాయి. గుజరాత్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ (BJP) అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తం 182 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థులు 150 చోట్ల ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ (Congress) పార్టీ 19 స్థానాల్లో, ఆప్ 9, ఇతరులు 4 చోట్ల లీడ్‌లో ఉన్నారు.
Early trends show BJP leading in 142 seats in #Gujarat, as per ECI
Congress leading in 20 seats and Aam Aadmi Party in 7 pic.twitter.com/5C2MPgyMsV
— ANI (@ANI) December 8, 2022
కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ 77 చోట్ల విజయం సాధించింది. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 30 స్థానాలను కూడా దక్కించుకునేలా కనిపించడం లేదు.
#HimachalPradeshElections | Congress leading on 33 and BJP on 31 seats as counting continues in the state with the majority mark being 35 pic.twitter.com/QGiAySx6O8
— ANI (@ANI) December 8, 2022
అటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ (AAP).. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లోనూ చీపురు పార్టీ అసలు తన ఉనికినే చాటుకోలేకపోయింది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత గుజరాత్, హిమాచల్‌లో అధికారం చేజిక్కుంచుకోవాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ అనుకున్నంతగా రాణించలేకపోయింది.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారం ఇవ్వని హిమాచల్ ఓటర్లు.. ఈసారి ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీలు మెజార్టీ మార్కుకు చేరువలో నిలిచిపోయాయి. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. ఇందులో 35 చోట్ల గెలుపొందిన పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ 35 స్థానాల్లో, బీజేపీ 31 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. మరో 2 సీట్లలో ఇతరులు ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో అధికారం కోసం రెండు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందనేదానిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది.