Coimbatore Accident (PIC@ ANI Twitter)

Coimbatore, June 25: తమిళనాడులోని కోయింబత్తూరు (Coimbatore) పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర్‌ వాహనాన్ని కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఓవర్‌ టేక్‌ చేయబోయి ఈ ఘోరానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జకీర్‌ హుస్సేన్‌ (Zakeer hussain) అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. కోయింబత్తూరులోని కేజీ చావడి (KG Chavadi) చెక్‌పోస్టు సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఓ కారు దాని ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో బైకును ఢీకొట్టింది. దాంతో బైక్‌ ఎగిరి వచ్చి దాని వెనుకాలే వెళ్తున్న ట్రావెలర్‌ వాహనంలో ఇరుక్కుపోయింది.

జకీర్‌ హుస్సేన్‌ తన తల ట్రావెలర్‌ వాహనానికి బలంగా గుద్దుకుని రోడ్డుపై పడిపోయాడు. తల పగిలిపోవడంతో హుస్సేన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎగిరి రోడ్డు పక్కన పడిపోయిన అతని కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.

జకీర్‌ హుస్సేన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ నిండు ప్రాణాన్ని తీయడమేగాక కారు ఆపకుండా వెళ్లిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.