Mumbai, SEP 04: టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) దుర్మరణం చెందారు. పాల్ఘర్‌లోని (Palghar ) చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు (Dies In Accident). ప్రమాదం తీవ్రంగా ఉండటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సూర్య నదిపై ఉన్న వంతెనపై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ చనిపోయిన విషయాన్ని పాల్ఘర్ పోలీస్ సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ ధ్రువీకరించారు. ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే మార్గంలో సూర్య నది వంతెనపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ కారు నంబర్ ఎంహెచ్ 47 AB 6705. వంతెనపై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరి ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు.
#CyrusMistry Was traveling from Ahmedabad to Mumbai, Car hit the divider , 4 people were there in the car , 2 died on spot , 2 moved to a local hospital in kasa pic.twitter.com/9YbeCeGwxu
— Utkarsh Singh (@utkarshs88) September 4, 2022
‘ఇది చాలా షాకింగ్ న్యూస్. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశాను. అతను మొదటిసారి బాంబే హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు నేను అతనికి స్వాగతం పలికాను. ఆ నాలుగేళ్లలో ఆయనతో కలిసి పనిచేయడంలో చాలా ఎంజాయ్ చేశాను. బోర్డ్ మీటింగ్ సందర్భంగా ఆయనతో తరచూ కలుస్తూ ఉండేవాడిని’ అని టాటా సంస్థ మాజీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ యోగేష్ జోషి సైరస్ మిస్త్రీతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
సైరస్ పల్లోంజీ మిస్త్రీ ఒక వ్యాపార కుటుంబంలో 1968 జూలై 4 న జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను, లండన్ ఇంపీరియల్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ పట్టా అందుకున్నాడు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. సైరస్ మిస్త్రీ 2012 డిసెంబర్ 28 న టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా వైదొలిగిన తర్వాత 2012 నుంచి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగాడు. 2016 అక్టోబర్ 24 న చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ తొలగించింది.