File (Credits: Twitter)

New Delhi, March 11: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam case)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. దాదాపు 8గంటలకు పైగా  ఆమెను ఈడీ (ED) అధికారులు ప్రశ్నించారు.  విచారణ మధ్యలో సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు భోజన విరామ సమయం ఇచ్చారు. అనంతరం 5గంటలకు తిరిగి విచారణ కొనసాగించారు. జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్‌ఏ50(2) (PMLA) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ రికార్డు  చేసినట్టు  సమాచారం. కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు, విజయ్‌ నాయర్‌, మనీష్‌ సిసోదియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్‌ పిళ్లైతో కలిపి కవితను విచారించారు.  ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్‌ ఆధారాలు లభించకుండా చేయడం, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్‌, సిసోదియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం.

అభియోగాలపై కవిత నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్న ఈడీ అధికారులు ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. గురువారం జరిగే విచారణలో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టనున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.  విచారణ ముగిసిన కవిత తుగ్లక్‌ రోడ్‌లోని సీఎం కేసీఆర్‌ (CM KCR) నివాసానికి వెళ్లారు.

కవిత ఈడీ విచారణ గంటల తరబడి కొనసాగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు.