GST Revenue Collection - Representational Image. | (Photo Credits: PTI/File)

New Delhi, AUG 13: జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ (GST-registered) చేయించుకున్న వారు అద్దె ఇళ్లలో ఉంటున్నట్టయితే, ఇంటి అద్దెపై (House rent) వారు 18 శాతం జీఎస్టీని చెల్లించాలంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం రేగడంతో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంట్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ ఇంటిని వ్యాపార సంస్థ అద్దెకు (rent house) తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంటి అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. అంతే తప్ప, ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చినప్పుడు, వ్యక్తిగత అవసరాలకు ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు ఆ ఇంటి అద్దెపై ఎలాంటి జీఎస్టీ కట్టనక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఓ వ్యాపార సంస్థ యజమాని అయినా సరే, భాగస్వామి అయినా సరే వ్యక్తిగత అవసరాల కోసం ఇంటిని అద్దెకు తీసుకుంటే జీఎస్టీ చెల్లించనవసరం లేదని వివరించింది. ఈ మేరకు సమాచార శాఖ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది.

”అద్దెకు ఉంటున్న ప్రతిఒక్కరూ జీఎస్‌టీ (GST) చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్‌టీ నమోదిత వ్యక్తులందరూ కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకుండే వారెవరూ జీఎస్‌టీ చెల్లించనక్కర్లేదు. వ్యాపారులు, ఏదైనా సంస్థలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా కుటుంబ అవసరాల కోసం ఇళ్లు అద్దెకు తీసుకుంటే పన్ను కట్టాల్సిన పని లేదు. వేతన జీవులకు ఎలాగూ జీఎస్‌టీ పరిధిలో ఉండరు కాబట్టి వారు కూడా అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాణిజ్య అసవరాల కోసం ఏదైనా ప్రాపర్టీని అద్దెకు తీసుకున్న వారు.. అదీ జీఎస్‌టీలో రిజిస్టర్‌ అయిన వాళ్లు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది” అని కేంద్రం స్పష్టత ఇచ్చింది.

TS EAMCET Result 2022 Declared: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల, ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత, eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోండి  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జూన్‌లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేశారు. ఇవి జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. అద్దెకుంటున్న వారు అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలన్నది అందులో ఒకటి. అయితే, ఈ విషయంలో ఎవరెవరికీ జీఎస్టీ వర్తించనుందనే దానిపై మీడియాలో భిన్నమైన కథనాలు వచ్చాయి.