Coronavirus (Photo-ANI)

New Delhi, April 13: భారతదేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల (Corona cases) సంఖ్య పెరుగుతుంది. రోజువారి కేసుల సంఖ్య దాదాపు ఎనిమిది వేలకు చేరువలో ఉంది. యాక్టివ్ కేసులసంఖ్య 40వేలు దాటింది. ఈ పరిస్థితుల్లో మరోసారి దేశాన్ని కోవిడ్ (Covid) అతలాకుతలం చేస్తుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ XBB.1.16 వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే దేశంలో 7,830 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid in India: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా, ఫోర్త్ వేవ్ వచ్చేసిందా, పెరుగుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్, మరి నిపుణులు ఏమంటున్నారు ? 

దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం ఒక్కరోజులో మహారాష్ట్రలో 1,115 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోనూ దాదాపు అదే స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే.. కోవిడ్ ఉద్ధృతి పట్ల ఆందోళన చెందుతున్న క్రమంలో అధికార వర్గాలు శుభవార్త తెలిపాయి.

మన దేశంలో కోవిడ్ ఎండమిక్ దశకు (Endemic Stage) చేరుకుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మరో పది నుంచి 12 రోజుల పాటు కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్, దాని ఉపరకమైన ఎక్స్‌బీబీ.1.16 కారణంగా కేసుల సంఖ్య పెరుగుదల వేగంగా ఉంది. అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతున్నట్లు ఆధారాల్లేవని పేర్కొన్నారు. అధికారుల అంచనా ప్రకారం.. దేశంలో కరోనా ఉద్ధృతి మరో పన్నెండు రోజులు మాత్రమే ఉంటుంది.