Light Combat Helicopters: ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ప్రత్యేకతలు ఇవే, కంటికి కనపడనంత వేగంతో శత్రువుల నుంచి తప్పిచుకునే సామర్థ్యం దీని సొంతం
Light Combat Helicopters (Photo Credits: ANI)

New Delhi, Oct 3: దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ‘ప్రచండ్‌’ను (Prachanda) జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) ప్రవేశపెట్టారు. సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, ఐఏఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్‌ ధరమ్‌ ప్రార్థన సైతం నిర్వహించారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్‌ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయిగా విశ్లేషకులు చెబుతున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన ప్రచండ్‌ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకునే సామర్ధ్యం ఉంది. వివిధ రకాల మందుగుండు సామగ్రిని అత్యంత వేగంగా మోసుకెళుతూ యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ప్రచండ్‌ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ (Light Combat Helicopters) హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్‌ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు.

Here's Video

ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్‌. మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.